నాతో నేనే చెప్పుకోని
రహస్యాల గుట్టు విప్పుకోవాలి.
ఆశాభంగాల భస్మరాశుల నుంచి
ఆశావిహంగాలను
ఒక్కుమ్మడిగా ఎగరేయాలి.
చిక్కని బతుకు చీకటిలో
ఎవరి చిరునవ్వుతోనైనా
వెలుగుపూలు పూయించాలి.
***
నన్ను నేనే క్షమించుకోలేని
అపరాధాలపై ఆరా తీసుకోవాలి.
నేర్చుకోవలసిన గుణపాఠాలపై
నిర్మొహమాటంగా
సిలబస్ సిద్ధం చేసుకోవాలి.
దారి తప్పిన కూడలి నుంచి
ఎవరి ఆసరాతోనైనా
రోడ్డు దాటాలి.
***
అంతశ్చేతనలో దాచిపెట్టిన కలలను
అక్షరాల్లోకి తెచ్చుకోవాలి.
అన్ని నిషేధాలను ధిక్కరించి
అలుపెరుగని పాటను ఆలపించాలి.
చిరకాలంగా తప్పిపోయిన పదాలను
ఎవరి చూపంటురాళ్ళతోనైనా
చటుక్కున వెతికి పట్టుకోవాలి.
వాయిదా వేస్తూ వస్తున్నా పద్యాలను
ఇప్పుడిక వెంటనే రాయాలి.
***