Pages

Search This Blog

amazon a-store

Wednesday, February 23, 2011

అంతా ప్రశాంతంగానే...

వెదజల్లిన చిల్లర నాణేలు
నడిరోడ్లపై ప్రజల ప్రాణాలు...
సూత్రదారులూ, శాస్త్రకర్తలూ భద్రం.
కుర్చీ కింద చితిమంటలు లేస్తున్నా,
నిమ్మకు నీరెత్తని స్థిత ప్రజ్ఞా ఏలినవారి సొంతం.
***
పొద్దు పొట్లాల నిండా నెత్తుటి మరకలు.
గద్దెపైనే నిద్దరోయే వాళ్ళ కలల్లో వెన్నెల తరకలు.
నడిచే గాయాలు,
వీధుల నిండా నిలువెత్తు నెత్తుటి వనాలు.
మనిషిని కాల్చిన మతం వాసన 
కాషాయ పతాకాలకు అగరు దూపారాధన...
***
నిక్కచ్చిగా ఇది ప్రజాస్వామ్యం!
ఎవరూ నిజాన్ని గురించి ప్రశ్నించ కూడదు.
ఏలినవారు ఏం చేసినా ఎదిరించ కూడదు.
ప్రశ్నించే వాళ్ళంతా దేశ ద్రోహులు,
ఎదిరించే వాళ్ళంతా ఉగ్రవాదులు.
***
నెత్తుటి కల్లాపు జల్లి 
శవాల ముగ్గులు పెట్టారు...
పరమ శాస్త్రోక్తంగా 
ధర్మ సంస్థాపనకు నడుం బిగించారు...

తుపాకుల దయవల్ల 
పరిస్థితి అదుపులోనే ఉంది.
మరో పదివేల మంది చచ్చినా 
వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది.
***
కత్తుల వంతెనపై 
కవాతు చేసే తరం అవతరించే వరకు 
అంతా ప్రశాంతంగానే ఉంటుంది.
***
('గోద్రా' సంఘటన జరిగినప్పుడు రాసిన కవిత ఇది. నిన్ననే 'గోద్రా' సంఘటనపై తీర్పు వచ్చిన సందర్భంగా...)

No comments: