రంగుల సుడిగుండం
'మనం సత్యాన్ని గ్రహించేందుకు దోహదపడే అబద్ధమే కళ. సృజన తాలూకు ప్రతి చర్యా తొలుత విధ్వంస చర్యే. అనవసరమైన దాన్ని నిర్మూలించేదే కళ...' ఈ మర్మాన్ని గ్రహించి లోకానికి చాటిన మహా కళాకారుడు పికాసో. పికాసో చిత్రానికి, ఎల్లోరా శిల్పానికి ముడిపెట్టిన సినీకవుల ద్వారా మాత్రమే పికాసోను తెలుసుకున్న ఇప్పటి తరం తెలుగు జనానికి మోహన్ రాసిన 'పికాసో' పుస్తకం ఒక కనువిప్పు. చిత్రకళపై తెలుగులో ఇప్పటివరకు వచ్చిన పుస్తకాలను వేళ్ళపై లెక్కించవచ్చు. ఇక ప్రపంచఖ్యాతి పొందిన చిత్రకారులను సమగ్రంగా పరిచయం చేసే పుస్తకాలు తెలుగులో ఇప్పటి వరకు లేనేలేవు. స్వతహాగా చిత్రకారుడు, కవి, ఆపైన పాత్రికేయుడు అయిన మోహన్ ఆ లోటు తీర్చారు. పికాసో జీవితాన్ని, కళను, వాటిలోని వివిధ దశలను మోహన్ సమగ్ర సంక్షిప్తంగా వివరించిన తీరు చదువరులను నిస్సందేహంగా ఆకట్టుకుంటుంది. వివిధ దశలలో పికాసో గీసిన చిత్రాలు, రూపొందించిన శిల్పాల ఫొటోలతో రూపొందించిన ఈ పుస్తకం పికాసోను సచిత్రంగా అర్థం చేసుకొనేందుకు దోహదపడుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వరవరరావు చెప్పినట్లు 'ఇది నిజంగా శ్రీశ్రీ మహాప్రస్థానానికి మంచి కానుక. శ్రీశ్రీ శతజయంతి ఉత్సవానికి ఉద్దీపననిచ్చే ఉల్లేఖన'. శ్రీశ్రీ కవిత్వంలో కనిపించే పతితులు, బాధాసర్పద్రష్టులు పికాసో చిత్రాల నిండా కనిపిస్తారు. పికాసో గురించి చెప్పేటప్పుడు మోహన్ శ్రీశ్రీని పలుసార్లు ఉటంకించడం సందర్భోచితంగానే కాదు, అనివార్యంగా కూడా అనిపిస్తుంది. పికాసో చిత్రాలలోనే అపురూపమైన కళాఖండం 'గెర్నికా'ను శ్రీశ్రీ రాసిన 'మానవుడా' గేయాన్ని ప్రస్తావించడం మోహన్ అధ్యయన విస్తృతికి, సందర్భశుద్ధికి అద్దంపడుతుంది. ఒక శ్రీశ్రీతో మాత్రమే సరిపెట్టుకోలేదు. ధూర్జటి, శ్రీనాథుడు, కృష్ణశాస్త్రి కూడా పలు ప్రస్తావనలలో సందర్భోచితంగా తారసపడతారు. వీళ్ళంతా పికాసోకి ఏమవుతారని సందేహపడక్కర్లేదు. ఎందుకంటే, శ్రీశ్రీ చెప్పినట్లు అంతా 'ఏకరక్త బంధువులు'. ఆరకంగా మోహన్ కూడా పికాసోకి ఏకరక్త బంధువే. బహుశా, ఆ బంధుత్వంతోనే అత్యంత సాహసోపేతంగా పికాసో జీవితాన్ని మన ముందుంచారు. వరవరరావు చెప్పినట్లుగా 'పికాసో జీవితాన్ని, చిత్రకళా పరిణామాన్ని మోహన్ సాహసంగానూ, సమర్థవంతంగాను తెలుగు కవిత్వంలో పునర్నిర్మించాడు. తాను రుణపడి ఉన్న కృష్ణశాస్త్రి వేలువిడిచిన శ్రీశ్రీ పికాసో 'మహాప్రస్థానా'న్ని మనకు మోహన్ కుంచెతో రచించాడంటే మీరు నమ్ముతారా? నమ్మాలి మరి.' మోహన్ రాసిన 'పికాసో' పుస్తకానికి వరవరరావు ప్రశంసే సిసలైన యోగ్యతాపత్రం. పికాసో ఒక రంగుల సుడిగుండం. మోహన్ ఈ సుడిగుండంలోకి దూకి, పికాసో ఆత్మను ఒడిసిపట్టుకోవడంలో విజయవంతమయ్యారు.
పికాసో
రచన: పి.మోహన్
కాకి ప్రచురణలు
హైదరాబాద్
వెల: రూ. 60
అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లో లభ్యం
No comments:
Post a Comment