Pages

Search This Blog

amazon a-store

Sunday, March 20, 2011

ఉల్లంఘన


సరిహద్దులను,
గిరిగీతలను 
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...

పట్టరాని గగనమ్మీదికి
పట్టెడన్ని కలలను ఎగరేద్దాం.
చెరలో మగ్గిపోతున్న 
పదాలను విడిపించి 
పతంగులుగా మారుద్దాం...

***

స్వేచ్ఛా హరణాలన్నీ 
నిశ్శబ్ద మానవ హననాలే-
ఆంక్షల కంచెలను దాటేసి,
ఆయుధాలను ఎక్కుపెడదాం.
కాలం చెల్లిన కత్తులను పారేసి,
క్షిపణులను సంధిద్దాం...

***

నిషేధాల నేపథ్యాలన్నీ
నిర్హేతుక, నిరర్థక 
భయాజనితాలే-
సంకోచాలను వదిలేసి,
శాసనాలను తగలేద్దాం.
ఏకపక్ష నీతిచంద్రికలకు 
నీళ్ళు వదిలేసి 
హక్కులకు హామీ ఇచ్చే 
న్యాయ శాస్త్రాన్ని 
సరికొత్తగా రాసుకుందాం...

***

సరిహద్దులను,
గిరిగీతలను 
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...

కళ్ళాలు లేని కెరటాలను 
కళ్ళలోకి స్వాగాతిద్దాం.
అరమరికలు లేనిచోట 
అనుబంధాలకు అడ్డమొచ్చే
అదృశ్య కుడ్యాలను 
ధిక్కార గీతాలతో 
పెకలించి పారేద్దాం...
సమరాన్ని సాగించి,
రుధిరాన్ని చిందించి 
స్వచ్ఛందంగా శ్వాసించుకుందాం...

***


No comments: