దశాబ్దం నాటి నన్ను నేను నీలో చూసుకుంటున్నాను
ఈ రోజు నా బాల్యపు నీడలను నీలో వెతుక్కుంటున్నాను
నీ ఆత్మీయ మృదు కరచాలనంతో,
నిర్మల సంభాషణతో రివైండ్ అయిన నా బాల్యాన్ని
నీ కళ్ళ తెరలపై చూసుకుంటున్నాను...
***
ముఖమంత అందంగా, నిర్మలంగా మనసుండేది.
మనసంత మార్దవంగా, సహజంగా ముఖముండేది.
బడిలోనూ, వీదిలోను, మిత్రుల ఆట పాటలతో
ఒక పరిమిత ప్రపంచం ఉండేది.
జేబుల్లో తిమ్మిరి బిళ్ళలతో పాటు కళ్ళలో కాంతులీనే కలలు ఉండేవి.
రంగు పెన్సిళ్ళతో తెల్ల కాయితమ్మీద ప్రపంచాన్ని కుదించే నైపుణ్యం ఉండేది.
నవ్వితే జలపాతాలు పరవళ్ళు తోక్కేవి.
ఏడిస్తే సముద్రాలు సుళ్ళు తిరిగిపోయేవి.
ఆడుకొంటున్నప్పుడు భూగోళం అరచేతిలో బొంగరమై తిరిగేది.
ఆకాశం గాలిపటమై తలలపై గిరికీలు కొట్టేది...
***
ఒక అందమైన కల కరిగిపోయాక-
లోకముంది, లోక కాలుష్యముంది,
కాలుష్యం సోకిన లోకంలో నిర్బంధ సభ్యత్వముంది.
***
నువ్వు నా కవిత్వాన్ని కలవరించినట్లు
నేను నీ కలలను కవిత్వీకరిస్తున్నాను.
సప్తవర్ణభరితమైన ఇంద్రధనుస్సు వైవిధ్యాన్ని గీస్తుంటే,
రంగులన్నీ కలగలసిపోయిన తెల్లకాయితానివి నువ్వు.
నేనిప్పుడు తెల్లకాయితమీదే ఓ కవిత రాస్తున్నాను.
3 comments:
తెల్లని నిర్మలమైన మీ కవిత చాల బావుంది.
ఒక అందమైన కల కరిగిపోయాక-
లోకముంది, లోక కాలుష్యముంది,
కాలుష్యం సోకిన లోకంలో నిర్బంధ సభ్యత్వముంది
చాలా నిఖార్సైన వాస్తవం. నిజమే..ఈ లోకంతో మన అనుబంధం ఇంతే...
తెల్లకాగితమంత స్వచ్చంగా, తేటతెల్లంగా ఉంది మీ కవిత.
Thank you friends for your kind comments on my poem.
Post a Comment