కొండొకచో
గుండె చప్పుళ్ళు కూడా
నిషిద్ధ నినాదాలవుతుంటాయి...
పెదవుల కదలికలు
ప్రచండ తుపానుల కన్నా, పెను భూకంపాల కన్నా
మించిన ప్రకృతి వైపరీత్యాలవుతుంటాయి...
***
కడగంటి చూపులతో
గర్భాదానాలు చేసిన పరాశరులనో,
అంగుళీయకాల ఆనవాళ్ళతో
గాంధర్వాలను అక్కడికక్కడే
విస్మరించిన దుష్యంతులనో
ఆదర్శంగా తీసుకోక
వాడెవడో పడమటి దేశాలవాడు
వాలంటైన్ కోసం
ఒక రోజు జరుపుకోవడం
నిజంగా నేరమే!
***
ఎట్టకేలకు ప్రేమకు సైతం
ఎల్లలను నిర్ధారించినందుకు
మమ్మేలుతున్న కాషాయ ప్రభువులకు
ఎనలేని కృతజ్ఞతలు...
***
రామచిలుకలను పంజరాల్లో బంధించండి
పంజరాలలోని రామచిలుకలకు
పరమ శాస్త్రోక్తంగా వస్త్రధారణ చేయించండి...
లేకుంటే, అవి రెక్కలల్లార్చినప్పుడు
ఏలినవారికి అశ్లీల భంగిమల్లా కనిపించవచ్చు...
పొరపాటుగానైనా చిలుకలకు వస పట్టకండి...
ముచ్చటగా అవి నాలుగు పలుకులు పలికితే,
ఏలినవారికి పచ్చి బూతుల్లా వినిపించే ప్రమాదముంది...
***
ఎవరో కవి అన్నట్లు,
'చాతీ లోపల గుండెకాయ ఉండటమే నేరం'
దానికి స్పందనలుండటం మరింత నేరం...
శూలధారులు గుచ్చి గుచ్చి పొడుస్తారు.
***
మనసులను పరచే సందేశాలనూ,
స్పందనలను కలబోసుకునే సమాగామాలనూ నిషేధించండి...
లేకుంటే, ప్రేమ అంటురోగంలా విస్తరించి
ఏలినవారి కాషాయాన్ని కలుషితం చెయ్యగలదు.
***
2 comments:
chaala manchi pani chesaaru chaala letugaa ayinaa.Nice to listen your heart beat. ... Wish you all the best....Nutakkiraghavendra Rao (Kanakaambaram)
Thank You sir.
Post a Comment