Pages

Search This Blog

amazon a-store

Monday, June 3, 2013

జిజ్ఞాసి జీవిత చరిత్ర 'డావిన్సీ కళ... జీవితం' పి. మోహన్ పుస్తకంపై సమీక్ష






ఇది ఒక జిజ్ఞాసి జీవిత చరిత్ర. బహుముఖ ప్రజ్ఞాశాలి బతుకు పుస్తకం. ప్రపంచ ప్రసిద్ధ కళాఖండం 'మోనాలిసా' ను చిత్రించిన చిత్రకారుడిగా మాత్రమే జన సామాన్యానికి తెలిసిన లియోనార్డో డావిన్సీ గురించిన అనేక విశేషాలను, అతడి బతుకులోని ఎగుడు దిగుళ్ళను బొమ్మకట్టినట్లు ఈ పుస్తకంలో వివరించారు మొహన్. వృత్తిరీత్యా పాత్రికేయుడే అయినా, ప్రవృత్తిరీత్యా  కవి, చిత్రకారుడు అయినందునే మోహన్ వ్యయ ప్రయాసలకోర్చి తెలుగు పాథకులకు, ముఖ్యంగా కళాభిమానులకు కానుకగా ఈ పుస్తకాన్ని తెచ్చారు. ఐదు శతాబ్దాల కిందటే గతించిన ఇటాలియన్ చిత్రకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి దావిన్సీపై ఆంగ్లం సహా పాశ్చాత్య భాషల్లో పలు పుస్తకాలు వెలువడ్డా, తెలుగులో మాత్రం ఇప్పటి వరకు అతడిపై సమగ్రమైన పుస్తకమేదీ లెదు. మోహన్ ఆ లోటు తీర్చారు. 

డావిన్సీ చిత్రకారుడు మాత్రమే కాదు, సంగీతకారుడు, శాస్త్రవేత్త కూడా. పలు శాస్త్రాల్లో అతడి ప్రతిభా పాటవాలు అమొఘమైనవి. ఆకాశంలో ఎగిరేందుకు విమానానికి నమూనాలాంటి ఆర్నితాప్టార్' రూపొందించిన మేధావి. శరీర నిర్మాణాన్ని తెలుసుకొనేందుకు శవాలను కోసి మరీ అధ్యయనం చేసిన జిజ్ఞాసి. భూగోళ, ఖగోళ శాస్త్రాలపైనా డావిన్సీ విస్తృత అధ్యయనం చేశాడు. అయితే, మోహన్ ఈ పుస్తకంలో ఆ విశేషాలను ప్రస్తావనకు మాత్రమె పరిమితం చెశారు. ఆ విషయాన్ని ఆయన ముందుమాటలోనే చెప్పుకున్నారు. తనకు గల పరిమితుల దృష్ట్యా డావిన్సీ శాస్త్ర రంగంలో చేసిన కృషిని విపులంగా వివరించకపోయినా, చిత్రకారుడిగా అతడి ప్రస్థానాన్ని, అతడి జీవిత చరిత్రను సమగ్రంగా అందించారు. 

డావిన్సీ గీసిన సుప్రసిద్ధ చిత్రాలే కాకుండా, అతడు గీసుకున్న స్కేచ్చులు, సగంలోనే వదిలేసిన బొమ్మలు, వివిధ చిత్రాల వెనుకనున్న గాథలను, వాటి చిత్రణలో డావిన్సీ ఎదుర్కొన్న సాధక బాధకాలను కథన శైలిలో వివరించిన తీరు పాఠకులను ఆకట్టుకుంటుంది. డావిన్సీ చిత్రాలను సైతం పుస్తకంలో చేర్చడం చిత్రకళాభిమానులకు కనువిందు చేస్తుంది. పునరుజ్జీవన కాలంలో చరిత్రను మలుపు తిప్పిన డావిన్సీ గురించి తెలుసుకోవాలనే చిత్రకారులు, చిత్ర కళాభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. 

2 comments:

కెక్యూబ్ వర్మ said...

మోహన్ గారి కవితా సంకలనం కిటికీ పిట్ట కొత్త శైలిలో నిర్బంధాన్ని కవిత్వీకరించింది. అలాగే మోహన్ అరుణతారలో ఎందరో ప్రసిద్ధ కళాకారులను పరిచయం చేసారు. ఈ పుస్తకం పరిచయం బాగుంది దాస్ గారు.

క‌వ‌న‌వ‌నం said...

Thank You Varma garu..