Pages

Search This Blog

Loading...

amazon a-store

Saturday, March 17, 2012

సామాన్యుడి స్వగతం


బతుకులింక దుర్భరం 
సడలుతోంది నిబ్బరం 
పన్నులపై పన్నులేసి 
నడ్డి విరిచె ప్రభుత్వం 

Sunday, November 27, 2011

తీరిక దొరికిన ఏకాంతంలో...


నాతో నేనే చెప్పుకోని
రహస్యాల గుట్టు విప్పుకోవాలి.
ఆశాభంగాల భస్మరాశుల నుంచి 
ఆశావిహంగాలను
ఒక్కుమ్మడిగా ఎగరేయాలి.
చిక్కని బతుకు చీకటిలో 
ఎవరి చిరునవ్వుతోనైనా
వెలుగుపూలు పూయించాలి.

***
నన్ను నేనే క్షమించుకోలేని 
అపరాధాలపై ఆరా తీసుకోవాలి.
నేర్చుకోవలసిన గుణపాఠాలపై 
నిర్మొహమాటంగా 
సిలబస్ సిద్ధం చేసుకోవాలి.
దారి తప్పిన కూడలి నుంచి
ఎవరి ఆసరాతోనైనా 
రోడ్డు దాటాలి.

***
అంతశ్చేతనలో దాచిపెట్టిన కలలను
అక్షరాల్లోకి తెచ్చుకోవాలి.
అన్ని నిషేధాలను ధిక్కరించి 
అలుపెరుగని పాటను ఆలపించాలి.
చిరకాలంగా తప్పిపోయిన పదాలను 
ఎవరి చూపంటురాళ్ళతోనైనా
చటుక్కున వెతికి పట్టుకోవాలి.
వాయిదా వేస్తూ వస్తున్నా పద్యాలను 
ఇప్పుడిక వెంటనే రాయాలి.

***

Saturday, November 5, 2011

ఒక పద్యంలో కలుసుకుందాం...


ఒక పద్యంలో కలుసుకుందాం...
తెరచిన పుస్తకంలాగ,
రగులుతున్న పొదలాగ,
జ్ఞాపకాల తలుపు తట్టిన విస్మృత పదం లాగ....

భూమ్మీద మనం 
భయావసరాల బరువు కింద నలిగిపోతుంటాం. 
నిర్బంధం పీడకలలను నెమరువేసుకుంటుంటాం.
వార్తాపత్రికలను అచ్చాదించుకుని,
వైయక్తిక సుఖాలకు, విజయాలకు పగలబడి నవ్వుకుంటాం.

ఆగ్రహాలతోను, అడ్డుగోడలతోను
నిర్మితమైన ప్రపంచం మనలా ఉండదు. 
మనల్ని అర్థం చేసుకోకుండా,
మనల్ని ప్రతిఘటిస్తుంది.
మనం ఆశించిన ఔన్నత్యాన్ని అది ఎప్పటికీ చేరుకోదు.

రుమేనియన్: బోర్నిస్లోవా వోల్కోదా

Wednesday, March 30, 2011

బ్లాక్ హార్స్


'నల్ల' గుర్రం దౌడు తీసెను 
డబ్బు గబ్బుతో దేశమదిరెను
'నల్ల' గుర్రం నోరు విప్పెను 
పెద్దలందరి గుండెలదిరెను 

Black SwanBlack Swan [Blu-ray]

Monday, March 28, 2011

మన జీవితం


జతగా కాకుండా, ఒకరికొకరుగా మనం లక్ష్యాలను చేరుకోలేం. 
జతగానే తెలిసిన మనం, మన గురించి అన్నీ తెలుసుకుంటాం.
మన పిల్లలు చిరునవ్వులు చిందించే ప్రతిదాన్నీ మనం ప్రేమిస్తాం.
చరిత్ర చీకటి కోణంలో... లేదా ఒంటరిగా రోదిస్తాం.

ఫ్రెంచ్: పాల్ ఎలార్డ్

Heaven is for Real: A Little Boy's Astounding Story of His Trip to Heaven and BackTangled (Two-Disc Blu-ray/DVD Combo)

Friday, March 25, 2011

ఆమె నిన్నిలా అడిగింది...


ఓ అమ్మాయి నిన్నిలా అడిగింది:
ఇంతకీ కవిత్వమంటే ఏమిటి?

ఆమెతో నువ్విలా చెప్పాలనుకున్నావు:
నువ్వు కూడా... అవును, నువ్వూ కవిత్వానివే...
సంభ్రమాశ్చర్యాలు గొలిపిస్తూ, అద్భుతాన్ని తలపించే 
నీ సొగసరి సౌందర్యం నాకు అసూయ కలిగిస్తోంది.
ఎందుకంటే నిన్ను నేను ముద్దాడలేను,
నీతో శయనించలేను.
నా వద్ద ఇంకేమీ లేదు.
ఇచ్చేందుకు ఏమీ లేనివాడు కచ్చితంగా పాడి తీరాలి.

కానీ, నువ్విదేమీ చెప్పకుండానే మౌనంలో మునిగిపోయావు.
ఇంకా ఆమె నీ అంతరంగ సంగీతాన్ని విననేలేదు.

***
చెక్: వ్లాదిమిర్ హోలాన్ 
ఇంగ్లీష్: ఇయాన్ మిల్జర్ 
Harry Potter and the Deathly Hallows, Part 1Alice At Heart

Sunday, March 20, 2011

ఉల్లంఘన


సరిహద్దులను,
గిరిగీతలను 
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...

పట్టరాని గగనమ్మీదికి
పట్టెడన్ని కలలను ఎగరేద్దాం.
చెరలో మగ్గిపోతున్న 
పదాలను విడిపించి 
పతంగులుగా మారుద్దాం...

***

స్వేచ్ఛా హరణాలన్నీ 
నిశ్శబ్ద మానవ హననాలే-
ఆంక్షల కంచెలను దాటేసి,
ఆయుధాలను ఎక్కుపెడదాం.
కాలం చెల్లిన కత్తులను పారేసి,
క్షిపణులను సంధిద్దాం...

***

నిషేధాల నేపథ్యాలన్నీ
నిర్హేతుక, నిరర్థక 
భయాజనితాలే-
సంకోచాలను వదిలేసి,
శాసనాలను తగలేద్దాం.
ఏకపక్ష నీతిచంద్రికలకు 
నీళ్ళు వదిలేసి 
హక్కులకు హామీ ఇచ్చే 
న్యాయ శాస్త్రాన్ని 
సరికొత్తగా రాసుకుందాం...

***

సరిహద్దులను,
గిరిగీతలను 
చెరిపేద్దాం,
తుడిచేద్దాం...

కళ్ళాలు లేని కెరటాలను 
కళ్ళలోకి స్వాగాతిద్దాం.
అరమరికలు లేనిచోట 
అనుబంధాలకు అడ్డమొచ్చే
అదృశ్య కుడ్యాలను 
ధిక్కార గీతాలతో 
పెకలించి పారేద్దాం...
సమరాన్ని సాగించి,
రుధిరాన్ని చిందించి 
స్వచ్ఛందంగా శ్వాసించుకుందాం...

***