ఆశించినట్టు అక్షరాలన్నీ పొందిగ్గా అమరిపోతే
కవిత్వం కోణార్క శిల్పంలా కాకుండా
జీవితంలా ఎందుకుంటుంది?
అయిదారంకెల జీతాలకు
జీవితాలను తాకట్టు పెట్టేసుకుని
ఆకాశం వైపు చూపు నిలిపి
నేలపై మీరు కురిపించే సానుభూతి
మధ్యలోనే ఆవిరవుతుంది.
ఆకాశం మీ చేతికందదు.
నేలను మీ పాదం తాకదు.
సరిహద్దుల మధ్య
సురక్షితంగా బతికిపోయే
భద్రజీవులు మీరు.
బక్కచిక్కిన బతుకుల్ని చూసినప్పుడల్లా
మీరు మహాకవిని మననం చేసుకుంటారు.
కండల్ని కాక కలల్ని నమ్ముకున్న వాళ్లం.
కత్తులు దూసేందుకు
కండలు కాక కలేజా కావాలని తెలిసిన వాళ్లం.
వెన్నుతట్టిన ప్రోత్సాహాల కుట్రకు
ఎర్రబడ్డ అరచేతులే ప్రత్యక్ష సాక్ష్యాలు.
గంగిరెద్దులతో సమస్య లేదు.
గానుగెద్దులు ఎప్పటికీ మీకు విధేయమైనవే!
ఎటొచ్చీ గర్జించడం నేర్చుకుంటున్న సింహప్పిల్లల్తోనే...
కవిత్వం ఇప్పుడు జూలు విదుల్చుకుంటోంది...
No comments:
Post a Comment