Pages

Search This Blog

amazon a-store

Saturday, February 23, 2008

వైరుధ్యం

నేను పిట్టంటాను,

నువ్వు పాతంటావు.

నేనంటాను సముద్రం,

నువ్వు లంగరంటావు

నేను రోడ్డంటాను

నువ్వు అంతరాయం కలిగిస్తావు:

రోడ్డు ఇల్లు.

నీ శరీరం ఉపరితలం

రహస్యాలు లేని, తరంగాలు లేని ఉపరితలం.

నా శరీరం ఒక రహస్యం,

నీ ఓడలన్నిటికీ విధ్వంస కేంద్రం.

నువ్వు పిట్టంటావు,

నేను తూటా అంటాను.

నువ్వంటావు సముద్రం.

నేనా పదాన్ని అలవోకగా అలలోకి వదిలేస్తాను.

నువ్వు రోడ్డంటావు.

సముద్రానికి రోడ్లుండవు.


***

స్పానిష్ : ఆన్సిఫా ఒసిన్నిక్


ఇప్పటికింకా

ఇంతకీ చెప్పొచ్చేదేమంటే,
చరిత్రంతా వదంతుల వడబోత...
ఇక్కడ నా పనంతా
కట్టుకథల కలబోత...

***

గమ్యాన్ని చేరుకోనూ లేదు;
ప్రయాణాన్ని ఇప్పుడే
ప్రారంభించనూ లేదు...
అనుభవ సారంశమేమంటే,
మజిలీలన్నీ కష్ట సుఖాల కలనేత...

***

అప్పుడు రాసిన
తొలకరి వాక్యం
చేరిగిపోనూ లేదు,
ప్రేమలేఖల పరంపర
ఆగిపోనూ లేదు...
వలపుల వ్యవహారాలన్నీ
ఎండమావుల తలపోత...

***

ఇప్పటికింకా
కాలం ముగిసిపోనూ లేదు,
అలాగని ఇప్పుడే
మొదలుకానూ లేదు...

ఇంతకీ ఏ అనుభవాన్నీ
అందుకోనూ లేదు;
అలాగని ఆలింగనాల కోసం
ఎదురుచూపు మానుకోనూ లేదు...

అందీ అందని
ప్రియురాళ్ళ కలలన్నీ
కనిపించని గాయాల సలపరింత...

***