Pages

Search This Blog

amazon a-store

Sunday, November 27, 2011

తీరిక దొరికిన ఏకాంతంలో...


నాతో నేనే చెప్పుకోని
రహస్యాల గుట్టు విప్పుకోవాలి.
ఆశాభంగాల భస్మరాశుల నుంచి 
ఆశావిహంగాలను
ఒక్కుమ్మడిగా ఎగరేయాలి.
చిక్కని బతుకు చీకటిలో 
ఎవరి చిరునవ్వుతోనైనా
వెలుగుపూలు పూయించాలి.

***
నన్ను నేనే క్షమించుకోలేని 
అపరాధాలపై ఆరా తీసుకోవాలి.
నేర్చుకోవలసిన గుణపాఠాలపై 
నిర్మొహమాటంగా 
సిలబస్ సిద్ధం చేసుకోవాలి.
దారి తప్పిన కూడలి నుంచి
ఎవరి ఆసరాతోనైనా 
రోడ్డు దాటాలి.

***
అంతశ్చేతనలో దాచిపెట్టిన కలలను
అక్షరాల్లోకి తెచ్చుకోవాలి.
అన్ని నిషేధాలను ధిక్కరించి 
అలుపెరుగని పాటను ఆలపించాలి.
చిరకాలంగా తప్పిపోయిన పదాలను 
ఎవరి చూపంటురాళ్ళతోనైనా
చటుక్కున వెతికి పట్టుకోవాలి.
వాయిదా వేస్తూ వస్తున్నా పద్యాలను 
ఇప్పుడిక వెంటనే రాయాలి.

***

Saturday, November 5, 2011

ఒక పద్యంలో కలుసుకుందాం...


ఒక పద్యంలో కలుసుకుందాం...
తెరచిన పుస్తకంలాగ,
రగులుతున్న పొదలాగ,
జ్ఞాపకాల తలుపు తట్టిన విస్మృత పదం లాగ....

భూమ్మీద మనం 
భయావసరాల బరువు కింద నలిగిపోతుంటాం. 
నిర్బంధం పీడకలలను నెమరువేసుకుంటుంటాం.
వార్తాపత్రికలను అచ్చాదించుకుని,
వైయక్తిక సుఖాలకు, విజయాలకు పగలబడి నవ్వుకుంటాం.

ఆగ్రహాలతోను, అడ్డుగోడలతోను
నిర్మితమైన ప్రపంచం మనలా ఉండదు. 
మనల్ని అర్థం చేసుకోకుండా,
మనల్ని ప్రతిఘటిస్తుంది.
మనం ఆశించిన ఔన్నత్యాన్ని అది ఎప్పటికీ చేరుకోదు.

రుమేనియన్: బోర్నిస్లోవా వోల్కోదా